Pawan Kalyan: కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడం కోసమే 'లాంగ్ మార్చ్': నాగబాబు
- ఓదార్పు యాత్ర చేసిన నేతకు కార్మికుల సమస్యలు తెలియవా? అంటూ ఆగ్రహం
- భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు కలచివేశాయన్న నాగబాబు
- పవన్ కు సామాజిక స్పృహ ఎక్కువని వెల్లడి
రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై జనసేన పార్టీ సమరశంఖం పూరించిన సంగతి తెలిసిందే. విశాఖలో భారీ స్థాయిలో 'లాంగ్ మార్చ్' పేరిట ర్యాలీ నిర్వహించేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. ఓదార్పు యాత్ర చేసిన నేతకు భవన నిర్మాణ రంగ కార్మికుల కష్టాలు తెలియవా? అంటూ సీఎం జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో చిక్కుకున్న కార్మికులకు అండగా నిలిచేందుకే 'లాంగ్ మార్చ్' నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
తన సోదరుడు పవన్ కల్యాణ్ కు సామాజిక స్పృహ ఎక్కువని, సమస్యలపై స్పందించే వ్యక్తి అని తెలిపారు. భవన నిర్మాణ రంగ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడడం చాలా బాధ కలిగించిందని నాగబాబు పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాటాన్ని మన కోసం మనం చేసే పోరాటంగా భావించాలని పిలుపునిచ్చారు.