Rohit Sharma: ప్రాక్టీసులో గాయపడిన రోహిత్ శర్మ!
- ఎడమతొడకు బంతి తగలడంతో ప్రాక్టీస్ నిలిపివేత
- ఆదివారం భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టీ-20
- వికెట్ కీపింగ్ బాధ్యతలు రిషభ్ పంత్ కే..?
బంగ్లాదేశ్ తో పొట్టి సిరీస్ ప్రారంభం కాకమునుపే టీ-20 భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయం బారిన పడ్డాడు. బంగ్లాతో భారత్ ఆడే మూడు టీ20 మ్యాచ్ లకు విరాట్ కోహ్లీకి విశ్రాంతి నివ్వడంతో రోహిత్ జట్టు పగ్గాలను చేపట్టాడు. రోహిత్ ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బౌలర్ విసిరిన బంతి ఎడమ తొడకు బలంగా తగిలింది. నొప్పితో విలవిలలాడుతూ రోహిత్ వెంటనే డ్రెస్సింగ్ రూంకి వెళ్లిపోయాడు. మళ్లీ ప్రాక్టీస్ కు రాలేదు.
రోహిత్ గాయంపై జట్టు మేనేజ్ మెంట్ ఒక ప్రకటన చేస్తూ ‘రోహిత్ చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తే తెలియజేస్తాము’ అని చెప్పింది. గాయం పెద్దది కాదని జట్టు వర్గాలు అనధికారికంగా పేర్కొన్నాయి. ఇక బంగ్లాతో ఆడే తొలి టీ-20 మ్యాచ్ లో వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ బరిలోకి దిగుతాడని భావిస్తున్నారు. సంజు శాంసన్ మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా, పంత్ వికెట్ల వెనక గ్లోవ్స్ తో కీపింగ్ చేశాడు. బంగ్లా పేస్ బౌలర్లను ఎదుర్కోవడానికి ప్రాక్టీసులో బంతులు వేగంగా విసిరే శ్రీలంక స్పెషలిస్ట్ త్రోవర్ నువాన్ ను జట్టు మేనేజ్ మెంట్ రప్పించింది. భారత్-బంగ్లా తొలి టీ 20 ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.