Pawan Kalyan: సమ్మెపై మాట్లాడదామంటే టీఆర్ఎస్ నేతల అపాయింట్ మెంట్ దొరకడం లేదు: పవన్ కల్యాణ్
- ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీరేవరకు అండగా ఉంటానని హామీ
- సమ్మెపై మాట్లాడటానికి సీఎం కేసీఆర్ సుముఖంగా లేరని వెల్లడి
- నేతల అపాయింట్ మెంట్ దొరకలేదన్న పవన్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తాను మధ్యవర్తిత్వం నెరపి సమస్య పరిష్కారం చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సమస్య పరిష్కారంకోసం తనను జోక్యం చేసుకోవాలని ఆర్టీసీ కార్మికులు కోరారని పవన్ పేర్కొన్నారు. ఈరోజు పవన్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కేశవరావు తదితరులు సమ్మెపై మాట్లాడేందుకు సుముఖంగా లేరని చెప్పారు.
సమ్మెపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు పీటముడిలా మారాయని, 28 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కార్మికులు తనతో చెప్పి బాధపడ్డారని తెలిపారు. తమ సమస్య తీరడానికి జోక్యం చేసుకోవాలని కోరారని పవన్ అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కేశవరావు, కొంతమంది మంత్రులను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోసం జనసేన నేతలు ప్రయత్నించినప్పటికి ఫలితంలేకపోయిందన్నారు. వాళ్లను కలవడానికి మరోసారి ప్రయత్నిస్తానని పవన్ తెలిపారు. కార్మికుల సమస్య పరిష్కారమయ్యేంతవరకు వారికి అండగా ఉంటానన్నారు. విశాఖలో ఈనెల 3న తలపెట్టిన లాంగ్ మార్చ్ అనంతరం మళ్లీ టీఆర్ ఎస్ నేతలను కలవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.