Shivsena: ఈ దేశం ఏ ఒక్కరి జేబులోనూ లేదు: బీజేపీపై శివసేన ఫైర్
- రాష్ట్రపతి పాలన వస్తుందని బెదిరించడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే
- ఇలాంటి బెదిరింపులకు మహారాష్ట్ర భయపడదు
- ఇంత వరకు ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు కాలేదనేదే అసలైన ప్రశ్న
సీఎం పదవి కోసం శివసేన పట్టుబడుతుండటంతో, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బీజేపీ కీలక నేతల్లో ఒకరైన సుధీర్ నిన్న మాట్లాడుతూ, నవంబర్ 7లోపు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. రాష్ట్రపతి పాలన వస్తుందంటూ బెదిరించడం... ముమ్మాటికీ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించింది.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి భారత రాష్ట్రపతి బీజేపీ కంట్రోల్ లో ఉన్నారా? లేక రాష్ట్రపతి స్టాంప్ బీజేపీ కార్యాలయంలో ఉందా? అంటూ శివసేన అధికారిక పత్రిక సామ్నా తన ఎడిటోరియల్ లో ప్రశ్నించింది. బీజేపీ నేత సుధీర్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమైనవని మండిపడింది. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరిచేలా ఉన్నాయని పేర్కొంది.
మహారాష్ట్రలో ఇంత వరకు ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు కాలేదనేదే అసలైన ప్రశ్న అని సామ్నా తెలిపింది. దీనికి సమాధానం ఎవరు చెబుతారని ప్రశ్నించింది. రాష్ట్రపతి పాలన వస్తుందంటూ హెచ్చరించడం మొఘల్ చక్రవర్తులు బెదిరించినట్టుందని విమర్శించింది. ఇలాంటి బెదిరింపులకు మహారాష్ట్ర భయపడదని తెలిపింది. మన రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రపతి అత్యున్నత వ్యక్తి అని... రాష్ట్రపతి అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, యావత్ దేశానికి ప్రతినిధి అని చెప్పింది. ఈ దేశం ఏ ఒక్కరి జేబులోనూ లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.