KCR: దేశంలో ఎక్కడా లేని పనికిమాలిన డిమాండ్లతో సమ్మెకు దిగారు: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
- ఇది ఇల్లీగల్ సమ్మె అని పేర్కొన్న కేసీఆర్
- కోర్టుకు కూడా అదే చెప్పామని వెల్లడి
- కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం
ఆర్టీసీ డిమాండ్లపై ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసి చర్చలు మొదలుపెట్టామని, కానీ, ఆర్టీసీ కార్మికులు మధ్యలోనే సమ్మెకు వెళ్లారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మధ్యలోనే సమ్మెకు వెళ్లినందున ఇది ఇల్లీగల్ సమ్మె అని కార్మిక శాఖ కమిషనర్ కూడా ప్రకటించారని వివరించారు. వాస్తవానికి ఒకసారి సమ్మె అక్రమం అని ప్రకటించాక, సంస్థకు, కార్మికులకు మధ్య సంబంధం తెగిపోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇది చాలా కఠినమైన చట్టం అని, కార్మికుల విషయంలో సంస్థ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చని వెల్లడించారు. తాము సమ్మె అక్రమం అన్న విషయాన్ని కోర్టుకు కూడా తెలియజేశామని చెప్పారు. ఇది డోలాయమాన పరిస్థితి అని, కార్మికుల నోళ్లలో మట్టి పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎవరో చెప్పిన పిచ్చి మాటలు పట్టుకుని మరి కొన్ని రోజుల పాటు కార్యాచరణ అంటూ ప్రకటనలు చేస్తున్నారని, ఇది పనికొచ్చే పని కాదని అన్నారు. పండుగ సమయంలో వచ్చే అదనపు ఆదాయాన్ని కోల్పోయి, దేశంలో ఎక్కడా లేని పనికిమాలిన డిమాండ్లతో రోడ్డెక్కారని మండిపడ్డారు.
హైదరాబాద్ లో ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆర్టీసీ సమ్మె వ్యవహారాన్ని సుదీర్ఘ సమయం పాటు చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, 49 వేల మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని తాము కఠినంగా వ్యవహరించడం లేదని అన్నారు.