Revanth Reddy: కేసీఆర్ మానవత్వంలేని ముఖ్యమంత్రి : కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ధ్వజం
- కార్మికుల పట్ల కనీసం జాలి చూపడం లేదు
- ఆర్టీసీ ఆస్తులు తనవారికి కట్టబెట్టేందుకే ఈ కుట్ర
- అదే జరిగితే ఆయన జైలుకు వెళ్లడం ఖాయం
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులు వీధినపడి నానా ఇబ్బందులు పడుతుంటే కనీసం మానవత్వం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. రెండు నెలలుగా అర్ధాకలితోను, పస్తులతోనూ కాలం గడుపుతున్న కార్మికులకు నచ్చజెప్పి వారి సమస్య పరిష్కరించాల్సింది పోయి బ్లాక్మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీఎస్ఆర్టీసీ సమ్మెపై నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై రేవంత్రెడ్డి తీవ్రంగా స్పందించారు. అధికార మదం, అహంకారంతో కేసీఆర్ మాట్లాడుతున్నట్లుంది గాని, బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నట్లు లేదన్నారు.
భవిష్యత్తుపై బెంగ, వర్తమానంలో బతకలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కనీసం ఆ పని చేయవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, చస్తే చావండి అన్నట్లు కేసీఆర్ తీరు ఉందన్నారు. ఆర్టీసీ అమ్మకానికి కేసీఆర్ ఎప్పుడో రంగం సిద్ధం చేశారని, అందుకే ఈ కాలయాపన అన్నారు.
ఆర్టీసీ ఆస్తులు తనవారికి కట్టబెట్టేందుకే ఈ కుట్రని, అదే జరిగితే ఆయన జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్న విషయాన్ని కేసీఆర్ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ను తెలంగాణ ఒక్క క్షణం కూడా భరించే స్థితిలేదన్నారు.