sand scarecity: ఇసుక విషయంలో ప్రభుత్వం సాకులు చెప్పడం మానాలి : సీఎంకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
- వరద వల్లే సమస్యని చెప్పడం సరికాదు
- మరి పక్కరాష్ట్రాల్లో ఈ సమస్య ఎందుకు లేదు
- తక్షణం కళ్లు తెరిచి ఉచితంగా సరఫరా చేయాలి
ఐదు నెలలుగా రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికుల జీవితాలు ‘అన్నమో రామచంద్ర’ అన్న స్థితికి చేరుకున్నాయని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెప్పడం మాని తక్షణం ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కి ఆయన లేఖ రాశారు. వరదల వల్లే ఇసుక సరఫరా చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పడం సిగ్గుచేటన్నారు. పక్క రాష్ట్రాలకు లేని వరద సమస్య ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఉందన్నారు.
ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులే కాకుండా అనుబంధ రంగ కార్మికులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. తక్షణం ఇసుకను ఉచితంగా సరఫరా చేయడంతోపాటు ఇన్నాళ్లు పనుల్లేక అల్లాడిపోతున్న కార్మికుల కుటుంబాలకు రూ.10వేలు చొప్పున భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ప్రజా సంఘాలతో కలిసి ‘ఇసుక సత్యాగ్రహం’ చేస్తామని తన లేఖలో హెచ్చరించారు.