Telangana: 5100 రూట్లకు అనుమతులిస్తే కార్మికుల పరిస్థితి ఏంటి?: కేసీఆర్ ప్రకటనపై ఆశ్వత్థామరెడ్డి స్పందన
- కార్మికులను తొలగించే అధికారం ఎవరికీ లేదు
- సమ్మె విరమించబోము
- కేసీఆర్ డెడ్ లైన్లు పెట్టడం కొత్తేం కాదు
- డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలి
కార్మికులను తొలగించే అధికారం ఎవరికీ లేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి అన్నారు. మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ సమావేశం నిర్వహించింది. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని, కేసీఆర్ డెడ్ లైన్లు పెట్టడం కొత్తేం కాదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని కోరారు.
ఆర్టీసీలోనూ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, ఒకవేళ ఈ సంస్థ ప్రైవేటు పరమైతే వెనకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. కార్మికులను కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన చెప్పారు. 5100 రూట్లకు అనుమతులు ఇస్తే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. తమ డిమాండ్లను కేసీఆర్ అంగీకరిస్తే యూనియన్లు ఉండవని ఆయన చెప్పారు.
కాగా, నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికులు బాధ్యతారహితంగా సమ్మె చేస్తున్నారని మండిపడ్డారు.