Kishan Reddy: ప్రభుత్వం, ఆర్టీసీ చెరో మెట్టు దిగి సమస్యను పరిష్కరించుకోవాలి: కిషన్ రెడ్డి
- తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
- స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
- కార్మికుల పట్ల సానుభూతి చూపాలంటూ ప్రభుత్వానికి హితవు
తెలంగాణలో నెలరోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, చెరో మెట్టు దిగి సమస్యలను సామరస్యపూర్వక ధోరణిలో పరిష్కరించుకోవాలని హితవు పలికారు. టీఎస్ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ దుందుడుకుతనంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రజలకు సేవ చేసే సంస్థ ఆర్టీసీని ప్రభుత్వమే కాపాడాలని, పేద డ్రైవర్లు, కండక్టర్లు, వారి కుటుంబ సభ్యుల జీవితాల గురించి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన సమయంలో కక్షసాధింపు ధోరణి అవలంబించడం సరికాదని అన్నారు.