Pawan Kalyan: సభా వేదిక వద్దకు చేరుకున్న లాంగ్ మార్చ్... నిప్పులు చెరిగిన అచ్చెన్నాయుడు, అయ్యన్న
- ముగిసిన లాంగ్ మార్చ్
- బహిరంగ సభ ఆరంభం
- టీడీపీ తరఫున అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు హాజరు
- వైసీపీ సర్కారుపై ధ్వజం
ఇసుక కొరత, కార్మికుల ఆత్మహత్యల పట్ల నిరసనగా జనసేన విశాఖలో నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ ర్యాలీ సభా వేదిక వద్దకు చేరుకుంది. మద్దిలపాలెం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు జరిగిన లాంగ్ మార్చ్ లో పవన్ కల్యాణ్ తో పాటు ఇసుకేస్తే రాలనంతగా కార్మికులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, ఈ ర్యాలీకి టీడీపీ కూడా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు హాజరయ్యారు. సభా వేదిక నుంచి ఆయన మాట్లాడుతూ, కార్మికుల పక్షాన పోరాడుతున్నందుకే జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నామని తెలిపారు.
స్వతంత్ర భారతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా, ఇంత శాడిస్టు ప్రభుత్వాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు కోట్ల మందికి అన్యాయం చేసిన సీఎం జగన్ అని, ఇంతమంది పోరాటం చేస్తుంటే సీఎంకు చీమకుట్టినట్టయినా లేదని వ్యాఖ్యానించారు. మెడలు వంచి ప్రభుత్వంతో పనిచేయించేందుకు అందరూ కలిసి రావాలని అచ్చెన్న సభావేదిక నుంచి అందరికీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని మంత్రులు కల్లు తాగిన కోతుల్లా ప్రవర్తిస్తున్నారని, రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 10 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే సామాజిక మరణాలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు దత్తపుత్రుడు అని పేర్కొన్న విశాఖ జిల్లాకు చెందిన ఓ మంత్రిపైనా అచ్చెన్న విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తావో తెలియని నువ్వా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడేది? అని నిలదీశారు.
అంతకుముందు అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఉప్పు సత్యాగ్రహానికి తరలివచ్చినట్టుగా ప్రజానీకం లాంగ్ మార్చ్ కు తరలివచ్చిందని అన్నారు. బహిరంగ సభ నిర్వహించనివ్వకుండా పోలీసులు అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో లారీ ఇసుక రూ.50 వేలకు చేరుకుందని, 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై స్పందించని సీఎంను ఇప్పుడే చూస్తున్నానని విమర్శించారు. ఐదు నెలలుగా ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అయ్యన్న ఆవేదన వ్యక్తం చేశారు.