Chandrababu: జగన్ పాలనలో క్రీడాకారుల పరిస్థితి దయనీయంగా ఉంది: శాప్ మాజీ చైర్మన్ తీవ్ర విమర్శలు

  • జగన్ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను పట్టించుకోవడం లేదు
  • చంద్రబాబు హయాంలో క్రీడలకు సముచిత స్థానం
  • 32వ జాతీయ క్రీడలతో ఏపీకి జాతీయస్థాయిలో గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పాలనలో క్రీడాకారుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. క్రీడాకారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. క్రీడల విషయంలో చంద్రబాబు శ్రద్ధ తీసుకునేవారని ప్రశంసించారు. ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన 32వ జాతీయ క్రీడలు ఓ మైలురాయిగా నిలిచిపోయాయని కొనియాడారు. జాతీయ స్థాయిలో ఏపీ ప్రతిష్ఠ పెరగడానికి అదే కారణమన్నారు.

విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక కూడా చంద్రబాబు క్రీడలకు పెద్దపీట వేశారని మోహన్ అన్నారు. క్రీడాకారులను చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహించిందని, ప్రతీ నియోజకవర్గంలో మినీ స్టేడియాల నిర్మాణానికి కృషి చేసిందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన వారిని ప్రభుత్వం ప్రోత్సహించిందని, పీవీ సింధుకు రూ.3 కోట్ల నగదుతోపాటు గ్రూప్‌-1 ఉద్యోగం, రాజధానిలో ఇంటి స్ధలం కేటాయించి గౌరవించిందని మోహన్ వివరించారు.

జగన్ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. క్రీడలు, క్రీడాకారుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని మోహన్ హితవు పలికారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న 35వ నేషనల్‌ జూనియర్‌ అథ్లెటిక్స్ క్రీడలకు హాజరైన క్రీడాకారులు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News