Maharashtra: ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం?.. సాయంత్రం గవర్నర్ తో భేటీ
- మహారాష్ట్రలో 50-50 ఫార్ములాకు శివసేన డిమాండ్
- కుదరని ఏకాభిప్రాయం
- సంజయ్ రౌత్ ఆధ్వర్యంలో గవర్నర్ ను కలవనున్న నేతలు
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ బీజేపీ ముందు డిమాండ్ పెట్టిన శివసేన నేతలు ఈ రోజు సాయంత్రం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు కోరనున్నట్లు తెలిసింది. భగత్ సింగ్ తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సహా ఆరుగురు నేతలు సమావేశం అవుతారు.
వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ డిమాండ్ కు బీజేపీ నేతలు ఒప్పుకోవట్లేదు. ఇటీవల శివసేన, బీజేపీ నేతలు వేర్వేరుగా గవర్నర్ తో భేటీ అయ్యారు. కాగా, మహారాష్ట్రలో తమకు 170 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని సంజయ్ రౌత్ చెప్పారు. మరో ఐదుగురు కూడా తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ఆయన నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.