Pawan Kalyan: పవన్ ఇచ్చే వినోదం కోసం వస్తారు... ఆ తర్వాత 'లాంగ్ మార్చ్' అనుకుంటూ ఎవరిళ్లకు వారు వెళతారు: విజయసాయి వ్యాఖ్యలు
- పవన్ లాంగ్ మార్చ్ పై విజయసాయి విమర్శలు
- పారితోషికం తీసుకునే రాజకీయాలు చేస్తాడంటూ వ్యాఖ్యలు
- ప్రజలకు దత్తపుత్రులు, ఇతర పుత్రులు అవసరంలేదన్న విజయసాయి
- వైఎస్ జగన్ ఒక్కడు చాలని ట్విట్టర్ లో స్పందన
జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కార్యక్రమంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ పారితోషికం తీసుకునే సినిమాల్లో నటిస్తాడని, బయట కూడా అంతేనని, పారితోషికం తీసుకునే రాజకీయాలు చేస్తాడని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. పవన్ సినిమాల్లో డైలాగులు వదిలినట్టు బయట కూడా చించేస్తా, పొడిచేస్తా అని చిటికెలు వేస్తుంటే ఆ ఉచిత వినోదం కోసం కొందరు గుమికూడతారని, ఆ తర్వాత 'లాంగ్ మార్చ్' అనుకుంటూ ఎవరిళ్లకు వారు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు.
ప్రజలకు దత్తపుత్రులు, చుట్టపు చూపుగా వచ్చే పుత్రుల అవసరంలేదని, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే వైఎస్ జగన్ చాలని విజయసాయి పేర్కొన్నారు. పెద్ద కొడుకునని చెప్పుకున్న చంద్రబాబు వంచనతో లక్షల కోట్లు దోచుకెళ్లాడని, ఇప్పుడు మీ దత్తపుత్నుడ్ని వచ్చానని చెబితే ప్రజలు కర్రలు, చీపుర్లతో తరిమి కొడతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏదో ఒక హడావుడి చేయాలి కాబట్టే దత్తపుత్రుడ్ని ముందుకు నెట్టాడని, కానీ లాంగ్ మార్చ్ కాస్తా తుస్సుమందని తెలిపారు.