AP CS: ఏపీ సీఎస్ ఆకస్మిక బదిలీపై కేశినేని నాని వ్యంగ్యాస్త్రం!
- ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
- ట్విట్టర్ లో స్పందించిన కేశినేని నాని
- కంగ్రాచ్యులేషన్స్ అంటూ ట్వీట్
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలలకే బదిలీ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. అందరినీ విస్మయానికి గురిచేస్తూ ఏపీ సర్కారు ఆయన్ను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా బదిలీ చేసింది. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ లో వ్యంగ్యంగా స్పందించారు. "ఏపీ సీఎస్ ఓ అంశంలో ప్రిన్సిపల్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకంగా సీఎస్ నే బదిలీ చేశారు. కంగ్రాచ్యులేషన్స్!" అంటూ ట్వీట్ చేశారు.
ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ మార్పిడి అంశంలో చోటుచేసుకున్న వివాదమే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ కారణమని తెలుస్తోంది. సీఎం కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గత వారం ఓ వివాదాస్పద జీవో రిలీజ్ చేశారు. దానిపై వివరణ ఇవ్వాలంటూ ప్రవీణ్ ప్రకాశ్ కు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసులు పంపారు. షోకాజ్ నోటీసులకు జవాబు చెప్పాల్సిన సీఎం కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఏకంగా సీఎస్ నే బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసి సంచలనం సృష్టించారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మరో ఐదు నెలలు సర్వీసు ఉంది. ఈ లోపే ఆయన సీఎస్ పోస్టు నుంచి బదిలీ కావడం అటు రాజకీయ వర్గాలను, ఇటు అధికార వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.