Vijayareddy: మా అబ్బాయికి మతిస్థిమితం లేదు: తహసీల్దార్ హత్య కేసు నిందితుడి తండ్రి వెల్లడి
- అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ దారుణ హత్య
- సజీవదహనం చేసిన సురేశ్ అనే యువకుడు
- సురేశ్ కు ఏమీ తెలియదంటున్న తల్లిదండ్రులు
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం తెలుగు ప్రజలను నివ్వెరపరిచింది. అందరూ చూస్తుండగానే సురేశ్ అనే వ్యక్తి ప్రభుత్వ కార్యాలయంలో ప్రవేశించి తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆపై తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ వ్యవహారంలో నిందితుడు సురేశ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడ్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.
కాగా, నిందితుడు సురేశ్ తండ్రి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు సురేశ్ కు మతిస్థిమితం లేదని అన్నారు. తమ భూమిపై వివాదం ఉండడంతో హైకోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. ఈ వివాదం గురించి సురేశ్ కు అసలు తెలియదని, అతను తహసీల్దార్ కార్యాలయానికి ఎందుకు వెళ్లాడో అర్థంకావడం లేదని పేర్కొన్నారు. అటు సురేశ్ తల్లి పద్మ మాట్లాడుతూ, ఎవరో కావాలని కుట్రపూరితంగా ఈ పని చేయించి ఉంటారని వ్యాఖ్యానించారు.