Jagan: ఆ టెక్నాలజీ చంద్రబాబు వద్ద ఉంటే ప్రభుత్వానికి ఇవ్వచ్చు కదా!: ఏపీ మంత్రి కన్నబాబు సెటైర్
- జగన్కు పెరుగుతున్న ఆదరణ చూడలేకే విమర్శలు
- నదులకు వరద వస్తే ఇసుక ఎలా తీస్తారు?
- ముఖ్యమంత్రిని ఎలా సంబోధించాలో కూడా బాబుకు తెలియదు
ఇసుక కొరత విషయంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి కన్నబాబు స్పందించారు. ఇసుక విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గత నాలుగు నెలలుగా నదులకు వరద పెరిగిందని పేర్కొన్న మంత్రి.. వరదల్లోనూ ఇసుకను బయటకు తీసే టెక్నాలజీ చంద్రబాబు వద్ద ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలని సెటైర్ వేశారు.
జగన్ చేస్తున్న అభివృద్ధిని చూడలేక, అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలతో జనంలో జగన్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే చంద్రబాబు ఇలా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి రాజధాని లేకపోవడానికి కారణం జగనేనని టీడీపీ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. రాజమౌళి, బోయపాటిలతో రాజధానిని ఇడ్లీ పాత్రలా డిజైన్ చేశారని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రిని ఎలా సంబోధించాలో కూడా చంద్రబాబుకు తెలియదని, జగన్ కనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా నిర్ణయం తీసుకోకపోతే టీడీపీ ఎప్పుడో ఖాళీ అయ్యేదని అన్నారు. ఆధారాలు లేని వార్తలు రాసినా, ప్రభుత్వంపై బురదజల్లేలా వార్తలు ప్రచురించినా కేసులు తప్పవని మంత్రి మరోమారు హెచ్చరించారు.