Raghavendra Rao: 'జగదేకవీరుడు అతిలోకసుందరి' రిలీజ్ కి ముందు నా పనైపోయిందనే విమర్శలు వచ్చాయి: రాఘవేంద్రరావు
- ఇది విఠలాచార్య చేయవల్సిన సినిమా అన్నారు
- సినిమా విడుదలతోనే తుపాను మొదలైంది
- వర్షంలోను జనం థియేటర్స్ కి వచ్చారన్న రాఘవేంద్రరావు
తెలుగు తెరకు భారీ చిత్రాలను .. తెలుగు హీరోలకు భారీ విజయాలను అందించిన దర్శకుడిగా రాఘవేంద్రరావుకు పేరు ఉంది. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ,'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాను గురించి ప్రస్తావించారు.
"ఈ సినిమాకి ముందు నాకు రెండు మూడు ఫ్లాపులు వచ్చాయి. అందువలన ఈ సినిమాతో నా పనైపోతుందని చెప్పుకున్నారు. ఇది విఠలాచార్య చేయవలసిన సినిమా .. రాఘవేంద్రరావు చేసేది కాదు అనే విమర్శలు వినిపించాయి. తీరా సినిమా విడుదల కాగానే భయంకరమైన తుపాను వచ్చేసింది.
ఎడతెరిపిలేని వాన .. అయినా జనం గొడుగులు వేసుకుని థియేటర్స్ కి వచ్చారు .. థియేటర్స్ వారు జనరేటర్లపై సినిమాను నడిపించారు. కొన్ని ఊళ్లలో థియేటర్స్ లోకి నీళ్లు వచ్చేయగా, కుర్చీలపై కాళ్లు ముడుచుకుని కూర్చుని మరీ ఈ సినిమా చూశారు. నిజంగా అది ఒక రికార్డు" అని చెప్పుకొచ్చారు.