ISIS: టర్కీ సైన్యానికి చిక్కిన అల్ బాగ్దాదీ సోదరి!
- గత నెలలో బాగ్దాదీ ఆత్మహత్య
- ఆపై ఉగ్ర స్థావరాలపై టర్కీ దాడులు
- అలెప్పో ప్రావిన్స్ లో పట్టుబడిన రస్మియా
గత నెలలో సిరియాలో అమెరికా సైన్యం చుట్టుముట్టిన వేళ, తనను తాను పేల్చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ సోదరి (అక్క) ఇప్పుడు టర్కీ భద్రతా దళానికి పట్టుబడింది. ఈ విషయాన్ని వెల్లడించిన టర్కీ మిలిటరీ అధికారి, బాగ్దాది సోదరి, 65 సంవత్సరాల రస్మియా అవద్ తమకు పట్టుబడిందని, ఆమెకు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని భావిస్తున్నామని అన్నారు.
ఇక్కడి అలెప్పో ప్రావిన్స్ లోని అజాజ్ పట్టణంలో ఓ కుటుంబంతో ఆమె కలిసి నివసిస్తుండగా, తమ దళాలు దాడి చేసి, ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నాయని అన్నారు. బాగ్దాది సోదరి రస్మియాతో పాటు ఆమె భర్త, కోడలు, ఐదుగురు పిల్లలు కూడా తమకు చిక్కారని, ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా టర్కీ దళాలు పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని జల్లెడ పడుతున్నాయని తెలిపారు. రస్మియా చిక్కడంతో ఉగ్రవాద కార్యకలాపాలపై లోతైన సమాచారం లభిస్తుందని భావిస్తున్నామని తెలిపారు.