Eluru: ఏలూరు సీరియల్ కిల్లర్ వివరాలు వెల్లడించిన పోలీసులు
- ప్రసాదంలో సైనేడ్ కలిపి హత్యలు
- డబ్బు కోసం ఘాతుకాలు
- వరుస హత్యలకు పాల్పడిన నిందితుడు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎల్లంకి సింహాద్రి అలియాస్ శివ అనే వ్యక్తి వరుసగా 10 మందిని సైనేడ్ తో హతమార్చిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. గుప్తనిధులు, బంగారం రెట్టింపు చేసే శక్తులు, రంగురాళ్లు పేరుతో అమాయకులను బురిడీ కొట్టించడం, వారి వద్ద అన్నీ దోచేసి ప్రసాదంలో సైనేడ్ కలిపి తినిపించడం సింహాద్రి నైజం. ఇటీవల ఓ పీఈటీ మృతితో అతడి ఘాతుకాలు వెలుగులోకి వచ్చాయి. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో నివ్వెరపరిచే నిజాలు తెలుసుకున్నారు. ఏలూరులో జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ మీడియాకు నిందితుడి నేరచరిత్ర గురించి వివరించారు.
గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన సింహాద్రి సులభంగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెరదీశాడు. డబ్బు కోసం ఆశపడేవాళ్లను గుర్తించి వారిని తన మాటలతో ఉచ్చులోకి లాగేవాడు. వారి నుంచి డబ్బు, నగలు దోచుకున్నాక తనతో తీసుకువచ్చిన ప్రసాదం ఇచ్చేవాడు. అందులో సైనేడ్ ఉందని తెలియని ఆ అమాయకులు క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయేవారు. ఈ విధంగా ఒకటిన్నర సంవత్సరం వ్యవధిలో 10 మందిని అంతమొందించాడు.
అయితే, నాగరాజు అనే పీఈటీ మరణం అనుమానాస్పదంగా ఉండడంతో సింహాద్రి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. నాగరాజు మొదట అనారోగ్యంతో మరణించాడని కుటుంబ సభ్యులు భావించినా, ఆ తర్వాత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాస్త లోతుగా పరిశోధించిన పోలీసులు సింహాద్రిని అరెస్ట్ చేసి అతడే ఈ ఘోరాలకు పాల్పడినట్టు తేల్చారు.