ISIS: ఇండియాపై దాడికి ఐసిస్ ఎన్నో ప్రయత్నాలు... అన్నీ విఫలమయ్యాయన్న అమెరికా!
- ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఐసిస్
- 20కి పైగా అనుబంధ సంస్థలున్నాయన్న అమెరికా
- మానవాళికి ఇంకా ముప్పు తప్పలేదన్న ట్రావర్స్
ఇండియాపై ఉగ్రదాడులు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ గత ఏడాది పలుమార్లు ప్రయత్నించి విఫలమైందని అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం వెల్లడించింది. ఐసిస్ లో అత్యంత ప్రమాదకరమైన అనుబంధ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఖొరసన్ గ్రూప్ (ఐఎస్ఐఎస్-కె) ఈ మేరకు ప్రణాళికలు రచించిందని, ఇప్పటివరకూ ఆఫ్ఘనిస్థాన్ పైనే దాడులు జరిపిన ఈ సంస్థ ఇతర ప్రాంతాలకూ విస్తరించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుందని యూఎస్ యాంటీ టెర్రసిస్ట్ సెంటర్ డైరెక్టర్ రస్సెల్ ట్రావర్స్ వెల్లడించారు.
కాగా, గత నెలలో పాక్, ఆఫ్ఘన్ ప్రాంతాల్లో పర్యటించిన ట్రావర్స్, పలువురితో భేటీ అయ్యారు. తన పర్యటన తరువాత ఐసిస్-కె ప్రాబల్యం పెరిగిన విషయం అర్థమైందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఐసిస్ కు అనుబంధంగా 20 గ్రూపులు పని చేస్తున్నాయని, వీటి వద్ద డ్రోన్ సాంకేతికత కూడా ఉందని ట్రావర్స్ గుర్తు చేశారు. కేవలం సిరియా, ఇరాక్ దేశాల్లో ఉగ్రవాద సంస్థను తుడిచి పెట్టినంత మాత్రాన ముప్పు తప్పినట్టు కాదని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఉగ్ర మూలాలు ఏనాటికైనా మానవాళికి పెనుముప్పేనని హెచ్చరించారు.