Ayyappa: అయ్యప్ప దీక్ష చేసే పోలీసులకు ప్రత్యేక అనుమతులు కుదరవు.. రెండు నెలలు సెలవు పెట్టుకోండి: రాచకొండ సీపీ స్పష్టీకరణ
- గడ్డాలు పెంచి, షూస్ లేకుండా డ్యూటీకి రారాదు
- నిర్దేశిత యూనిఫామ్ తప్పనిసరి
- మెమోను జారీ చేసిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్
పోలీసులు ఎవరైనా మాల ధరించి, అయ్యప్ప దీక్ష చేయాలని భావిస్తే, వారు రెండు నెలల పాటు సెలవుపై వెళ్లాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. విధుల్లో ఉండే సిబ్బంది గడ్డాలు పెంచరాదని, షూ లేకుండా డ్యూటీ చేయకూడదని, నిర్దేశిత యూనిఫామ్ తప్పనిసరని ఆయన అన్నారు. ఈ మేరకు మెమో నం 987/ఈ3/2011ను మహేశ్ భగవత్ కార్యాలయం జారీ చేసింది.
వాస్తవానికి దీక్ష చేయాలని భావించే పోలీసులు, ప్రత్యేక అనుమతులు కోరుతూ, తమ ఉన్నతాధికారులకు దరఖాస్తులు పెట్టుకుంటారు. ఆపై వాటిని పరిశీలించి అధికారులు అనుమతులు ఇస్తుంటారు. ఈ సంవత్సరం మాత్రం, దీక్షకు అనుమతి కోసం వచ్చే దరఖాస్తులను తమ కార్యాలయానికి పంపవద్దని డీసీపీలు, ఏసీపీలు, ఎస్ హెచ్ఓలకు సీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. క్రమశిక్షణ కలిగిన పోలీసు శాఖలో ప్రత్యేక అనుమతులు కుదరబోవని, రెండు నెలలు సెలవు పెట్టుకుని దీక్ష చేసుకోవచ్చని స్పష్టం చేశారు.