Crime News: తహసీల్దార్ చాంబర్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రైతు
- కడప జిల్లాలో ఘటన
- మూడేళ్లుగా తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న రైతు
- భూ సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో విసుగు
తహసీల్దార్ చాంబర్ లో ఓ వ్యక్తి తనపై పెట్రోల్ పోసుకున్న ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. ఆ జిల్లాలోని కొండాపురం మండలంలోని బుక్కపట్నం గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమి సమస్యను పరిష్కరించాలంటూ మూడేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ, తన పని జరగకపోవడంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు.
బి. ఆదినారాయణ (46) అనే రైతుకు బుక్కపట్నంలోని 122 సర్వేనంబర్‌లో 10.94 ఎకరాల డీకేటీ భూమి ఉండగా, దాంట్లో 3.50 ఎకరాల భూమికి గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి ఓ ప్రాజెక్టు కింద ముంపు పరిహారం తీసుకున్నాడు. అయితే, మిగిలిన భూమిపై వివాదం చెలరేగుతోంది. ఆ భూమిలో 3.50 ఎకరాలు తన తండ్రి పేరుతో ఉందంటూ దాన్ని తన తల్లి పేరుమీద ఆన్లైన్లో నమోదు చేయాలని కోరుతున్నాడు.
ఈ నేపథ్యంలో రైతు హైకోర్టును కూడా ఆశ్రయించాడు. తహసీల్దార్ కార్యాలయానికి ఈ పని మీదే మూడేళ్లుగా వచ్చిపోతున్నాడు. దీంతో విసిగిపోయిన ఆయన నిన్న ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆయనపై నీళ్లు చల్లి మంటలు ఆర్పిన అక్కడి సిబ్బంది అనంతరం ఆయనను పోలీసులకు అప్పగించారు.