Jagan: ఇది తుగ్లక్ చర్య.. మూల్యం చెల్లించుకోక తప్పదు: యనమల
- ప్రభుత్వ భూములు అమ్మాలనుకోవడం తుగ్లక్ చర్య
- ఏపీ మ్యాప్ లో అమరావతి లేకపోవడానికి వైసీపీనే కారణం
- ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై అనుమానాలు ఉన్నాయి
సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వ స్థలాలను అమ్మాలనుకోవడం తుగ్లక్ చర్య అని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. రాజధాని అమరావతిని మారుస్తామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారని... ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే మ్యాప్ లో అమరావతిని ఎత్తేశారని చెప్పారు. రాజధాని లేకుండా ఏపీ మ్యాప్ విడుదల కావడానికి వైసీపీనే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రమేయంతోనే బొత్స ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీపై పలు అనుమానాలు ఉన్నాయని... లోగుట్టును బయటపెట్టాలని యనమల డిమాండ్ చేశారు. కులాలు, మతాల వారిగా సమాజాన్ని చీల్చడమే జగన్ లక్ష్యమని దుయ్యబట్టారు.