Shivsena: బీజేపీకి షాక్.. మరోసారి శరద్ పవార్ తో శివసేన చర్చలు
- మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన
- పట్టువీడని బీజేపీ, శివసేన
- శరద్ పవార్ ను కలిసిన సంజయ్ రౌత్
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత శాసనసభ పదవీకాలం మరో రెండు రోజుల్లో ముగుస్తున్నప్పటికీ... ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇంత వరకు ఒక్క అడుగు కూడా పడలేదు. 50:50 ఫార్ములాకు కట్టుబడి తమకు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని ఇవ్వాలన్న శివసేన డిమాండ్ కు బీజేపీ తలొగ్గలేదు. మరోవైపు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ఈరోజు మరోసారి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీని కాదని ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన యత్నిస్తోందనే వార్తలు ఊపందుకున్నాయి.
పవార్ తో భేటీ అనంతరం సంజయ్ రౌత్ మాట్లాడుతూ, మహారాష్ట్రలోనే కాకుండా యావత్ దేశంలో పవార్ ఒక గొప్ప నేత అని కొనియాడారు. ప్రజలందరి నాయకుడంటూ కితాబిచ్చారు. ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడకపోవడంపై పవార్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అస్థిరత్వం నెలకొందనే ఆందోళనను సమావేశం సందర్భంగా పవార్ వెలిబుచ్చారని తెలిపారు. ప్రస్తుత భేటీలో కొంత మేరకు చర్చించామని... తదుపరి సమావేశాల్లో లోతుగా చర్చిస్తామని చెప్పారు.