Bulbul: బంగాళాఖాతంలో 'బుల్ బుల్'... రాష్ట్రానికి ముప్పు లేనట్టే!
- తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం
- రాగల 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం
- ఒడిశా, బెంగాల్ తీరం దిశగా పయనం
అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఇది తుపానుగా మారితే 'బుల్ బుల్' అని పిలిచే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం ఒడిశాలోని పరదీప్ కు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. బుల్ బుల్ తో ఏపీకి ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. మరోవైపు అరేబియా సముద్రంలో కొనసాగుతున్న 'మహా' తుపాను క్రమంగా బలహీనపడుతోంది. దీని కారణంగా మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముంది.