central information comissioner: స.హ కమిషనర్ల నియామకంలో అలసత్వంపై కేంద్రం సహా 9 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

  • జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  • పదవులు ఖాళీ కావడానికి ముందే నియామకాలు చేపట్టాలి
  • తాజా పరిస్థితిపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించమని ఆదేశం

సమాచార హక్కు కమిషనర్ల నియామకంలో పదవులు ఖాళీ కావడానికి ఒకటి లేదా రెండు నెలల ముందే నియామకాల ప్రక్రియను ప్రారంభించాలని సుప్రీంకోర్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  కమిషనర్ల నియామకాల్లో గతంలో సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను పాటించడంలేదని స.హ. చట్టం కార్యకర్త అంజలీ భరద్వాజ్ పిటిషన్ వేశారు.  దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం సీఐసీ(కేంద్ర సమాచార కమిషనర్), ఎస్ఐసీ(రాష్ట్ర సమాచార కమిషనర్) నియామకాలపై కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆంధ్రప్రదేశ్ తో కలుపుకొని 9 రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. నియామకాలకు సంబంధించి తాజా పరిస్థితులపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాల గడువును ధర్మాసనం నిర్దేశించింది.

అంతకుముందు పిటిషన్ దారు తరపున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.  కోర్టు ఆదేశాల ప్రకారం కమిషనర్ పదవులకు ఎంపికచేసిన వారి పేర్లను వెబ్ సైట్లో పెట్టలేదని, కొన్ని రాష్ట్రాలు కూడా కమిషనర్లను నియమించలేదని తెలిపారు.  సీఐసీ నియామకం కోసం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎంపికలో అనుసరించిన పద్ధతిని పాటించాలన్న సుప్రీంకోర్టు సూచనను కేంద్రం విస్మరించిందని ఆయన పేర్కొన్నారు. కమిషనర్ల నియామకంలో మంచి రికార్డున్న అధికారులు, పలు రంగాల్లో పేరుగాంచిన ప్రముఖులను తీసుకోవాల్సి ఉండగా కొన్ని రాష్ట్రాలు కేవలం అధికారులకే ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఖాళీల భర్తీకి 6 నెలలు గడువు విధించినా రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News