Teaching in Telugu: బోధన భాషగా ఆంగ్లంతో పాటు, తెలుగుకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం జగన్ కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
- విద్యాశాఖ నిర్ణయంతో మాతృభాష తెలుగుకు అవమానం
- దేశంలో హిందీ తర్వాత తెలుగే ఎక్కువమంది మాట్లాడతారు
- రాష్ట్రంలో ఇప్పటికే 8,500 స్కూళ్లలో ఇంగ్లీష్ బోధన భాషగా ఉంది
ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరిచేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలంటూ సీపీఐ నేత రామకృష్ణ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఇటీవల 1 నుంచి 8 వ తరగతివరకు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న నినాదాన్ని అవమానించినట్లవుతుందన్నారు.
ఇంగ్గీష్ తో పాటు తెలుగుకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ లో మాతృభాషను కించపరిచినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 43,200 పాఠశాలలు ఉండగా, 8,500 పాఠశాలల్లో ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం బోధన భాషగా కొనసాగుతోందన్నారు. దేశంలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాషే అని సీపీఐ నేత చెప్పారు.