Mallu Bhatti Vikramarka: తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన విపరీత పరిస్థితులకు దారితీస్తోంది: భట్టి
- తహసీల్దార్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
- అధికారిణిని సజీవ దహనం చేయడం ఇదే ప్రథమమని వ్యాఖ్యలు
- కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలని హితవు
తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన విపరీత పరిస్థితులకు దారి తీస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో భూమి చుట్టూ పలు ఉద్యమాలు పుట్టాయన్నారు. ఒక ప్రభుత్వ అధికారిణిని తన కార్యాలయంలోనే సజీవ దహనం చేసిన ఘటన దేశంలో ఎక్కడా జరగలేదని భట్టి పేర్కొన్నారు. హైదరాబాదు, గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్ట్ ‘బి’లో పెట్టిన భూముల సమస్యలు పరిష్కరించకుండా ఆలస్యం చేస్తుండటంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. తహసీల్దార్ విజయారెడ్డి, డ్రైవర్ గురునాథ్ ల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వెలుపలికి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.