Jagan: ప్రతి బోటుకు జీపీఎస్ ఉండాల్సిందే, టికెట్లు ఇచ్చే అధికారం కంట్రోల్ రూమ్ లదే: సీఎం జగన్
- బోటు ప్రమాదాల నివారణపై సమీక్ష
- ఎమ్మార్వోల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు
- ఈ నెల 21న కంట్రోల్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిపోయిన దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర సర్కారుపై పలు విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ బోటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మార్వోల ఆధ్వర్యంలో 8 చోట్ల కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని, ప్రతి కంట్రోల్ రూమ్ లో 13 మంది సిబ్బంది ఉండాలని స్పష్టం చేశారు. ఈ నెల 21న కంట్రోల్ రూమ్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. బోట్లలో ఎట్టి పరిస్థితుల్లో మద్యం వినియోగం ఉండరాదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. బోటు సిబ్బందికి తప్పనిసరిగా బ్రీత్ అనలైజర్ టెస్టులు నిర్వహించాలని తెలిపారు. ప్రతి బోటుకు జీపీఎస్ ఉండాల్సిందేనని, టికెట్లు ఇచ్చే అధికారం కంట్రోల్ రూమ్ లదే నని జగన్ అన్నారు.