Ayodyha: అయోధ్యపై తీర్పు నేపథ్యం... యూపీలో కాలేజీలే జైళ్లు... వేలమంది తరలింపు!
- అతి త్వరలో అయోధ్యపై తీర్పు
- యూపీలో తాత్కాలిక జైళ్లుగా కాలేజీలు
- అల్లర్లకు అవకాశాలు ఉన్నాయన్న నిఘా వర్గాలు
దశాబ్దాల తరబడి నలుగుతున్న రామజన్మభూమి, అయోధ్య కేసు విషయంలో మరికొన్ని రోజుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అయోధ్య, దాని చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు వారణాసి, లక్నో, అలహాబాద్ ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు.
ఇక రాష్ట్రంలోని పలు కాలేజీలను తాత్కాలిక జైళ్లుగా అధికారులు మార్చారు. తీర్పు వచ్చిన తరువాత ఓ వర్గం వారు అల్లర్లకు దిగే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు ఉప్పందించడంతో, అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా, గతంలో గొడవల్లో పాల్గొన్న వేలాది మందిని ఈ జైళ్లకు తరలిస్తున్నారు. ఇవన్నీ తాత్కాలిక జైళ్లేనని, తీర్పు వెలువడి, పరిస్థితులు సద్దుమణిగిన తరువాత, ఏ కేసూ లేకుండా వీరిని విడిచిపెడతామని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 8 తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు.