Nirdesh Bisoya: దేశవాళీ క్రికెట్ లో మేఘాలయా కుర్రాడి అద్భుత ప్రతిభ!
- విజయ్ మర్చంట్ ట్రోఫీలో రికార్డు
- 10 వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ నిర్దేశ్ బైసోయా
- క్రికెట్ ప్రపంచం పొగడ్తలు
దేశవాళీ క్రికెట్ లో మేఘాలయకు చెందిన యువ ఆఫ్ స్పిన్నర్ నిర్దేశ్ బైసోయా అసాధారణ ప్రతిభను కనబరిచి సరికొత్త రికార్డును సృష్టించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా, అండర్-16 పోటీల్లో పాల్గొన్న నిర్దేశ్, నాగాలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొత్తం 10 వికెట్లనూ తన ఖాతాలో వేసుకున్నాడు.
21 ఓవర్లు బౌలింగ్ చేసిన నిర్దేశ్, 10 మెయిడెన్లు వేసి, 51 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇతని ధాటికి నాగాలాండ్ జట్టు 113 పరుగులకే ఆలౌట్ అయింది. గడచిన రెండేళ్లుగా అండర్-16 జట్టులో ఆడుతున్న నిర్దేశ్, గత సిరీస్ లో ఆరు మ్యాచ్ లు ఆడి 33 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
మీరట్ కు చెందిన నిర్దేశ్, ప్రస్తుతం మేఘాలయ జట్టులో ఉన్నాడు. కాగా, దాదాపు 20 సంవత్సరాల క్రితమే అనిల్ కుంబ్లే టెస్ట్ ల్లో పాకిస్థాన్ పై ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఆపై కూచ్ బెహర్ ట్రోఫీలో మణిపూర్ పేసర్ రెక్స్ సింగ్ కూడా ఇదే ఘనత సాధించాడు. ఇటీవలి సీకే నాయుడు ట్రోఫీలో పుదుచ్చేరి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సిదాక్ సింగ్ కూడా 10 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. 10 వికెట్లు తీసిన నిర్దేశ్ పై క్రికెట్ ప్రపంచం పొగడ్తలు గుప్పిస్తోంది.