Shivsena: బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన శివసేన
- కొత్త ఎమ్మెల్యేలను లాక్కునేందుకు యత్నిస్తున్నారు
- ఇలాంటి చర్యలను శివసేన సహించదు
- రైతులకు గత బీజేపీ ప్రభుత్వం సాయం చేయలేదు
మహారాష్ట్రలో బీజేపీ-శివసేనల మధ్య అగాధం మరింత పెరుగుతోంది. తన మిత్రపక్షం బీజేపీపై శివసేన సంచలన ఆరోపణలు చేసింది. తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజీపీ డబ్బులు ఎరజూపుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తన అధికారిక పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ధన బలంతో లాక్కునేందుకు కొందరు యత్నిస్తున్నారని తెలిపింది. రాజకీయ విలువలను దిగజార్చే ఇలాంటి చర్యలను శివసేన సహించబోదని చెప్పింది. రైతులకు గత బీజేపీ ప్రభుత్వం సాయం చేయలేకపోయిందని... అందుకే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని తాము కోరుకుంటున్నామని తెలిపింది.
శివసేన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. బీజేపీ వైఖరిపై ఆ పార్టీ మిత్రపక్షమైన శివసేన పార్టీనే ఆందోళన చెందుతోందని... బీజేపీ ఎంతగా దిగజారిపోయిందో దీంతో అర్థమవుతోందని విమర్శించింది. మహారాష్ట్రను బీజేపీ నుంచి కాపాడాలని వ్యాఖ్యానించింది.