IMD: తీవ్ర వాయుగుండంగా మారిన 'బుల్ బుల్'... రేపటికి పెను తుపాన్!
- వెస్ట్ బెంగాల్ వైపు వెళ్లనున్న తుపాన్
- తీరం వెంబడి 50 కి.మీ. వేగంతో గాలులు
- ఏపీ, టీఎస్ లకు ముప్పు లేదన్న అధికారులు
ప్రస్తుతం బంగాళాఖాతంలోని పారాదీప్ కు దక్షిణ అగ్నేయంగా 750, సాగర దీవులకు 860 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'బుల్ బుల్' తుపాను తీవ్ర రూపం దాల్చింది. ఇది రేపటికి పెను తుపానుగా మారుతుందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.
అయితే, దీని వల్ల తెలుగు రాష్ట్రాలకు ప్రమాదం లేదని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు వెళుతోందని అన్నారు. అయితే, తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగసిపడతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు. ఏపీలోని కోస్తా ప్రాంతంలో ఉన్న ప్రధాన నౌకాశ్రయాల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.