priyanka gandhi: దేశంలో ఎవరికి సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయి?: ప్రియాంకా గాంధీ
- ప్రధాని మోదీ అమెరికా వెళ్లి 'హౌడీ మోదీ' లో పాల్గొన్నారు
- భారతీయులకు హెచ్1 బీ వీసాలను అమెరికా పెద్ద మొత్తంలో తిరస్కరిస్తోంది
- దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగోలేదు
- సేవా రంగం కుదేలైపోతోంది
ప్రధాని మోదీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. అమెరికాలోని 'హౌడీ మోదీ' వంటి భారీ సభలను నిర్వహించినప్పటికీ భారతీయులకు హెచ్1 బీ వీసాల మంజూరు విషయంలో మోదీ ఫలితాలు సాధించలేకపోయారని ట్వీట్ చేశారు.
'బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాలనలో దేశంలో ఎవరికి సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయన్న విషయాన్ని దేశంలోని ప్రతి ఒక్కరూ అడగాలి. ప్రధాని మోదీ అమెరికా వెళ్లి 'హౌడీ మోదీ' లో పాల్గొన్నారు. కానీ, తమ దేశంలో పనిచేయాలనుకుంటున్న భారతీయులకు అమెరికా హెచ్1 బీ వీసాలను పెద్ద మొత్తంలో తిరస్కరిస్తోంది' అని ప్రియాంకా గాంధీ విమర్శించారు.
'దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగోలేదు. సేవా రంగం కుదేలైపోతోంది.. ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయి. వీటివల్ల సామాన్య ప్రజలు పడుతోన్న బాధలను అధికారంలో ఉన్న వారు పట్టించుకోవట్లేదు' అని ప్రియాంకా గాంధీ విమర్శించారు. కాగా, భారతీయ ఐటీ ఉద్యోగులు పొందాలనుకుంటోన్న హెచ్1-బీ వీసాలు.. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో తీసుకొచ్చిన మార్పుల వల్ల భారీగా తిరస్కరణకు గురవుతున్నాయి.