Telangana: ఏపీఎస్ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదు: తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై కోర్టులో కేంద్రం ఆసక్తికర వ్యాఖ్యలు
- తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
- హైకోర్టులో విచారణ
- ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెపై తాజాగా మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ అధికారులు సమర్పించిన అఫిడవిట్లపై విచారణ జరగ్గా, కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. ఆర్టీసీని విభజించాలని కానీ, పునర్వ్యవస్థీకరించాలని కానీ తమ అనుమతి కోరలేదని స్పష్టం చేశారు.
అసలు, ఏపీఎస్ఆర్టీసీ విభజన ఇంకా పూర్తికాలేదని వెల్లడించారు. అలాంటప్పుడు చట్టబద్ధతలేని టీఎస్ఆర్టీసీలో 33 శాతం వాటా ఎక్కడ ఉంటుందని, చట్టబద్ధత ఉన్న ఏపీఎస్ఆర్టీసీలోనే 33 శాతం వాటా ఉందని రాజేశ్వరరావు కోర్టుకు తెలియజేశారు. టీఎస్ఆర్టీసీకి చట్టబద్ధత లేనందున ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి ఉన్న వాటాను బదిలీ చేయడం కుదరదని తేల్చి చెప్పారు.
దీనిపై ఏజీ,తెలంగాణ ఆర్టీసీ అధికారులు స్పందిస్తూ, ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని కోర్టుకు తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేశామని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, ఏపీఎస్ఆర్టీసీని విభజించాలని రెండు రాష్ట్రాలు కోరాలి కదా? అని ప్రశ్నించింది. కేంద్రం ఆమోదం లేకుండా కొత్త ఆర్టీసీ సంస్థలు ఏర్పాటు ఎలా సాధ్యం అంటూ అడిగింది. విభజన అంశం పెండింగ్ లో ఉందని మీరే అంటున్నారు, అలాంటప్పుడు కొత్త ఆర్టీసీ ఏర్పాటు ఎలా సాధ్యమైందని న్యాయమూర్తి ప్రశ్నించారు.