canada Formula: కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన ఘనత ఆర్టీసీ కార్మికులదే: మంద కృష్ణ
- కెనడా ఫార్ములాను అమలు చేయాలని కుట్ర పన్నారని ఆరోపణ
- టీఎన్జీవో నాయకులు ఆర్టీసీ జేఏసీకి అండగా నిలవాలని హితవు
- ఆర్టీసీ సమ్మె కేసీఆర్‌లో భయాన్ని పుట్టించిందంటూ వ్యాఖ్యలు
కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన ఘనత ఆర్టీసీ కార్మికులదేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ అన్నారు. వందేళ్ల క్రితం నాటి కెనడా ఫార్ములాను రాష్ట్రంలో అమలు చేయాలని కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. నేడు మంద కృష్ణ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కొంతమంది కార్మికులపై కాల్పులు జరిపించి ఉద్యమాన్ని పక్కదోవ పట్టించాలనుకున్నారని ఆరోపించారు. కానీ, భయంతో వెనుకంజ వేశారన్నారు. టీఎన్జీవో నాయకులు ఆర్టీసీ జేఏసీకి అండగా నిలవాలన్నారు. కేసీఆర్‌కు వంత పాడి ఆర్టీసీ కార్మికులకు వెన్నుపోటు పొడవద్దని సూచించారు.
సమ్మె మొదలైన నాటి నుంచి కోర్టు కార్మికుల పక్షానే నిలిచిందని, కోర్టు హెచ్చరికలే సీఎస్‌ను, ఆర్టీసీ ఎండీని, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిని బోనులో నిలబెట్టాయని తెలిపారు. ఆర్టీసీ సమ్మె కేసీఆర్‌లో భయాన్ని పుట్టించిందంటూ.. కేవలం తొమ్మిది నిమిషాల్లో పరిష్కారమయ్యే సమస్యకు తొమ్మిది గంటలు కేటాయించి చర్చలు జరిపాడని విమర్శించారు.
కేసీఆర్, ఆయన భజనపరులకు నిన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమ సంపాదనకు కేరాఫ్ అడ్రస్ అయ్యిందన్నారు. దానిపై కేంద్రం దృష్టి సారించడంతో కేసీఆర్ కన్ను ఆర్టీసీపై పడిందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల నుంచి రాజకీయ పార్టీలను, ప్రజలను దూరం చేయాలని కేసీఆర్ కుట్ర చేశారని మండిపడ్డారు.