Britain: బ్రిటన్ పర్యాటకుడ్ని అమాంతం మింగేసిన రాకాసి సొరచేప!
- సొరచేపకు ఆహారంగా మారిన బ్రిటన్ పర్యాటకుడు
- భార్య పుట్టినరోజు కోసం రీ యూనియన్ ఐలాండ్ వెళ్లిన బ్రిటన్ వాసి
- ఈతకు వెళ్లి తిరిగిరాని వైనం
భార్య పుట్టినరోజు పండుగను చిరస్మరణీయం చేసుకోవాలని తపించిపోయిన ఓ బ్రిటన్ పర్యాటకుడి జీవితం విషాదాంతమైంది. భార్య కళ్లలో ఆనందం చూడాలనుకున్న ఆ పర్యాటకుడు ఓ రాకాసి సొరచేపకు ఆహారమయ్యాడు.
బ్రిటన్ కు చెందిన రిచర్డ్ టర్నర్ (44) ఎడింబర్గ్ లో ఓ ఉన్నతాధికారి. తన భార్య జన్మదిన వేడుకల కోసం హిందూ మహాసముద్రంలో విసిరేసినట్టుగా ఉండే రీ యూనియన్ ఐలాండ్ కు వెళ్లారు. అక్కడి లాగూన్ బీచ్ లో విహరిస్తుండగా, రిచర్డ్ ఈత కోసం సముద్రంలోకి వెళ్లాడు. వెళ్లిన వాడు మళ్లీ తిరిగి రాకపోవడంతో అతని భార్య తల్లడిల్లిపోయింది. అక్కడి భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో వారు గజ ఈతగాళ్లు, హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
రిచర్డ్ ఈతకు వెళ్లిన ప్రాంతంలో నాలుగు భారీ సొర చేపలు సంచరిస్తుండడంతో వారికి సందేహం వచ్చింది. వాటిని బంధించి వాటి పొట్టల్లో ఉన్న అవశేషాలను పరిశీలించగా ఓ మనిషి చేయి కనిపించింది. దానికున్న ఉంగరం ఆధారంగా అది తన భర్త రిచర్డ్ దేనని భార్య గుర్తించింది. రిచర్డ్ ను మింగేసిన ఆ కిల్లర్ షార్క్ పొడవు 13 అడుగులు అని అధికారులు వెల్లడించారు.