Narendra Modi: కర్తార్ పూర్ నడవా ప్రారంభించిన మోదీ.. ఇమ్రాన్ తో పాటు పలువురికి కృతజ్ఞతలు చెప్పిన ప్రధాని
- గురు నానక్ దేవ్ 550వ జయంతి వేడుకల సందర్భంగా ప్రారంభం
- భారత్ వైపున నిర్మించిన ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు ఓపెన్
- బేర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించిన మోదీ
పాకిస్థాన్, కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత్‌లోని డేరా బాబా నానక్ గురుద్వారాతో కలిపే 'కర్తార్‌పూర్ నడవా' ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును ఈ రోజు ప్రధాని మోదీ ప్రారంభించారు. పంజాబ్, సుల్తాన్పూర్ లోధిలో బేర్ సాహిబ్ గురుద్వారాను ఆయన సందర్శించారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ 550వ జయంతి వేడుకల సందర్భంగా డేరా బాబా నానక్‌ను సందర్శించి దీన్ని ప్రారంభించారు.
అనంతరం మోదీ ప్రసంగించారు. కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణం కోసం సహకరించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. పంజాబ్ సర్కారుతో పాటు ఈ కారిడార్ నిర్మాణంలో కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.
గురుబనీని ప్రపంచంలోని పలు భాషల్లోకి తర్జుమా చేస్తున్నామని, ఇందుకు చొరవ తీసుకున్న యునెస్కోకి కృతజ్ఞతలని మోదీ అన్నారు. గురు నానక్ దేవ్‌పై పరిశోధనలను ప్రోత్సహించేందుకు బ్రిటన్‌లోని ఓ వర్సిటీతో పాటు కెనడాలోని మరో వర్సిటీ కృషిచేస్తున్నాయన్నారు. అమృత్సర్, కేశ్‌ఘర్, ఆనంద్‌పూర్, డామ్‌డమ, పాట్నా, నాందేడ్‌లలోని సిక్కు పవిత్ర క్షేత్రాలను కలుపుతూ రైల్వేశాఖ కొత్త రైళ్లను నడుపుతుందని చెప్పారు.