Ashok Singhal: ఈ ఘనత అశోక్ సింఘాల్ దే... ఆయనకు కేంద్రం 'భారతరత్న' ఇవ్వాలి: 'అయోధ్య' తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి స్పందన
- అయోధ్య భూమిపై సుప్రీం తీర్పు
- హర్షం వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్యస్వామి
- చారిత్రక విజయంగా అభివర్ణన
ఇప్పటివరకు ఎంతో సమస్యాత్మకమైన వివాదంగా ప్రసిద్ధికెక్కిన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు ప్రకటించింది. దీనిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. ఇది చారిత్రక విజయం అని పేర్కొన్న ఆయన, ఈ విజయాన్ని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) దివంగత నేత అశోక్ సింఘాల్ కు ఆపాదించారు. ఈ చిరస్మరణీయ ఘడియల్లో అశోక్ సింఘాల్ ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, ఆయనకు మోదీ సర్కారు వెంటనే 'భారతరత్న' ప్రకటించాలని కోరారు.
దశాబ్దాల కిందట అయోధ్య భూవివాదం ఉత్పన్నమైనప్పుడు అశోక్ సింఘాల్ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఓ ఉద్యమం సాగించినంత తీవ్రతతో అయోధ్య అంశాన్ని జాతీయస్థాయికి చేర్చారు. దేశంలోనే అతిపెద్ద మతపరమైన, రాజకీయ అంశంగా నేడు అయోధ్య అంశం చర్చకు వస్తోందంటే అందుకు కారణం అశోక్ సింఘాల్ అన్నది సుస్పష్టం.