Ayodhya: అయోధ్య తీర్పుపై రష్మి వ్యాఖ్యలు... గతంలో తనపై హిందూ వ్యతిరేకి ముద్రవేశారని వెల్లడి
- అయోధ్యపై సుప్రీం తీర్పు
- జై శ్రీరామ్ అంటూ రష్మి ట్వీట్
- సోషల్ మీడియాలో భిన్నస్పందన
అయోధ్య భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక రీతిలో తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ స్పందించారు. తొలుత జై శ్రీరామ్ అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు నెటిజన్ల నుంచి భిన్నస్పందనలు వచ్చాయి. వాటికి కూడా రష్మి ఎంతో ఓపిగ్గా బదులిచ్చి తన అభిప్రాయాలు వెల్లడించారు.
అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును సమర్థించడం ద్వారా ముస్లింలదే తప్పని మీరనుకుంటున్నారా? అని ఓ వ్యక్తి ప్రశ్నించగా, "వారికి అయోధ్యలో మరో చోట భూమి ఇస్తున్నారు కదా, ఇక్కడ మీ కొచ్చిన సమస్య ఏంటి? లేక, నాతో మరోసారి ట్వీట్ చేయిద్దామనా?" అంటూ ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. మరికొన్ని ట్వీట్లకు స్పందిస్తూ, గతంలో తనను కూడా హిందూ వ్యతిరేకిగా ముద్రవేశారని రష్మి, దీపావళికి టపాసులు పేల్చడం వద్దన్నందుకు తనపై విమర్శలు గుప్పించారని అన్నారు.