Jagan: హృదయం దహించుకుపోయింది... వాడికి కఠిన శిక్ష వేయించేందుకు చర్యలు: వైఎస్ జగన్
- చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన వర్షిత హత్యాచారం కేసు
- అత్యాచారం తరువాత ఊపిరాడకుండా చేసి చంపిన దుర్మార్గుడు
- వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు
చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం గుట్టపాళ్యంలో తీవ్ర కలకలం రేపిన ఐదేళ్ల చిన్నారి వర్షిత హత్యాచారం కేసుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తన హృదయాన్ని కలచివేసిందని అన్నారు. వర్షిణిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన కిరాతకుడిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ దుర్మార్గుడికి కఠినంగా శిక్ష పడేలా చూసేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. కాగా, వర్షిత పోస్టుమార్టం రిపోర్టు ముదివేడు పోలీసు అధికారులకు అందింది. చిన్నారిపై అత్యాచారం జరిగిందని, ఆపై ఊపిరాడకుండా చేసి, చంపేశారని వైద్యులు ధ్రువీకరించారు.
కాగా, వర్షిత కిడ్నాప్ నకు గురైన ప్రాంతంలోని సీసీకెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించినట్టు తెలుస్తోంది. అతను కర్ణాటకకు చెందిన వాడని చెబుతున్న అధికారులు, అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చిన్నారికి తన ఫోన్ లోని కొన్ని ఫోటోలను అతను చూపించినట్టుగా సీసీ ఫుటేజీల్లో రికార్డయింది.