KCR: కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తాననడం సరికాదు: అశ్వత్థామరెడ్డి
- హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియకుండానే కేసీఆర్ ఇలా అన్నారు
- ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకులు నలుగురు రేపు ఒక్కరోజు నిరాహార దీక్ష
- ఈ నెల 18న సడక్ బంద్
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజు కొనసాగుతోంది. హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియకుండానే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సమంజసం కాదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. నిన్న చలో ట్యాంక్‌బండ్ నిరసన కార్యక్రమానికి ఒక గంట పాటు అనుమతి ఇస్తే అంతటి గందరగోళం చెలరేగేది కాదని చెప్పారు.
ఈ రోజు విద్యానగర్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో అఖిలపక్ష భేటీ జరిగింది. అనంతరం అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ... ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకులు నలుగురు రేపు ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగుతారని చెప్పారు. కార్మికులపై జరుగుతోన్న దమనకాండకు నిరసనగా ఈ నెల 18న సడక్ బంద్ నిర్వహిస్తామన్నారు. కార్మికులపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలను ఎగ్జిబిషన్ పెట్టి ప్రదర్శిస్తామని వివరించారు.