Paruchuri Gopalakrishna: ఈ నిజం ఎవరి కళ్లలోకి చూసి చెప్పమన్నా చెబుతాను: పరుచూరి గోపాలకృష్ణ
- పరుచూరి భాషాభిమానం
- ఇంగ్లీషు మాట దొర్లకుండా మాట్లాడాలంటూ పోటీ
- ఎవరూ నెగ్గని వైనం
- వరుస ట్వీట్లతో హితవు పలికిన పరుచూరి
ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. వాటిలో అధికశాతం విమర్శలే ఉంటున్నాయి. ఇక అసలు విషయానికొస్తే, ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తనదైన శైలిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను 2003లో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో మూడు నిమిషాల పాటు ఒక్క ఇంగ్లీషు పదం కూడా దొర్లకుండా మాట్లాడాలని పోటీ పెట్టానని, ఈ పోటీలో ఏపీలోని ఏ ప్రాంతంలో కూడా ఒక్కరు కూడా గెలవలేకపోయారని వెల్లడించారు. ఈ నిజాన్ని తాను ఎవరి కళ్లలోకి చూసి చెప్పమన్నా చెబుతానని ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాదు, తాను ఈ పోటీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా పరుచూరి వివరించారు. అప్పట్లో ఓ పాత్రికేయుడు తన అడ్రస్ కోసం ఎవరినో అడగ్గా, "స్ట్రయిట్ తీస్కో, లెఫ్ట్ వెళ్లు, రైట్ సైడ్, సెకండ్ హౌస్, పైన రెడ్ ఫ్లాగ్ ఉంటది..." అంటూ చెప్పినట్టు తెలిసిందని అన్నారు. దాంతో ప్రజల్లో తెలుగు భాష పరిస్థితి ఏంటని గుర్తించేందుకు ఆ పోటీ పెట్టానని గోపాలకృష్ణ తెలిపారు.
పెదవులు అసత్యం చెప్పే వీలుందని, కానీ వారి కళ్లు మాత్రం అబద్ధం చెప్పలేవని, అందుకే మాట్లాడేటప్పుడు ఎదుటివారి కళ్లలోకి చూస్తే నిజం దొరికిపోతుందని భాష్యం చెప్పారు. "ఈ మాట నా కళ్లలోకి చూసి చెప్పండి" అనే మాట పుట్టింది ఇలాగేనని, ఈ విషయం తెలిసి మసులుకోండి సన్నిహితులారా అంటూ హితవు పలికారు. అధికారం అంటే పదవిని అలంకరించడం కాదని, అదొక యోగంగా భావించి పదిమందికీ ఉపయోగపడే ఆలోచనలు చెయ్యాలని సూచించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.