Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరం... ఎవరేమంటున్నారంటే...!
- ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి ఆహ్వానం పలికిన గవర్నర్
- నో చెప్పిన బీజేపీ
- సీఎం పీఠంపై కన్నేసిన శివసేన
ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ సైతం స్థానిక పార్టీల మద్ధతు కోసం చూడాల్సిన పరిస్థితి మహారాష్ట్రలో కనిపిస్తోంది. కానీ ఇదే అదనుగా శివసేన సీఎం పీఠంపై బేరాలు ఆడుతుండడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని బీజేపీ నిస్సహాయత వ్యక్తం చేసింది. శివసేన పార్టీ సీఎం పదవిని ఫిఫ్టీ-ఫిఫ్టీ ప్రాతిపదికన పంచుకుందామని ప్రతిపాదిస్తోంది. బీజేపీ అందుకు వ్యతిరేకిస్తోంది.
దీనిపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ తమను ఆహ్వానించారని వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేన తమకు మద్దతు ఇవ్వడంలేదని వివరించారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని, అభినందిస్తామని తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ వర్గాలు స్పందిస్తూ, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన రావడం తమకు ఇష్టంలేదని తెలిపాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ పేర్కొన్నారు. ఇక, కింగ్ మేకర్ సీట్లో కూర్చున్న శివసేన స్పందిస్తూ, శివసేన అభ్యర్థే సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.