TN Seshan: దేశంలో ఎన్నికల గతిని మార్చిన టీఎన్ శేషన్ ఇక లేరు!
- నిన్న రాత్రి తన నివాసంలో గుండెపోటుతో మృతి
- దేశంలో ఎన్నికల వ్యవస్థని గాడిలో పెట్టిన శేషన్
- భారత ఎన్నికల సంస్కర్తగా గుర్తింపు
భారత్‌లో ఎన్నికల గతిని మార్చిన కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ (87) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన ఇంట్లో ఆదివారం రాత్రి 9:30 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. డిసెంబరు 1932లో కేరళలోని పాలక్కాడ్ జిల్లా తిరునెళ్లాయిలో శేషన్ జన్మించారు. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన కాలంలో ఎన్నో సంస్కరణలను అమలు చేశారు. అప్పటి వరకు అస్తవ్యస్తంగా ఉన్న ఎన్నికల వ్యవస్థను గాడిలో పెట్టారు. దానికి కొత్త రూపు తీసుకొచ్చారు. ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు ఎన్ని అధికారాలు ఉంటాయో అన్నీ దేశానికి చూపించారు.
ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డులు ప్రవేశపెట్టింది ఆయనే. అలాగే, ప్రచార వేళల కుదింపు, ఎన్నికల్లో వ్యయ నియంత్రణ వంటి వాటిని అమలు చేసి చండశాసనుడుగా పేరు తెచ్చుకున్నారు.1989లో కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన శేషన్..1996లో రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.