Maharashtra: రాజకీయం 'మహా' మలుపు... శివసేనకు షరతులు పెట్టిన ఎన్సీపీ!
- బీజేపీతో తెగదెంపులు చేసుకుంటేనే మద్దతు
- స్పష్టం చేసిన ఎన్సీపీ
- బయటి నుంచి మద్దతుకు కాంగ్రెస్ సుముఖత
మహారాష్ట్ర ప్రజలు గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టని నేపథ్యంలో, రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమకు సంఖ్యాబలం లేని కారణాన్ని చూపుతూ, అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటుకు విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆ చాన్స్ శివసేనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఎన్సీపీతో కలిసి పీఠాన్ని ఎక్కాలని శివసేన భావిస్తోంది. ఈ కూటమికి బయటి నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీని అధికారానికి దూరం చేయవచ్చని కాంగ్రెస్ కూడా భావిస్తోంది.
అయితే, బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటే మాత్రమే శివసేనతో జట్టు కడతామని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ తాజాగా మెలిక పెట్టింది. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని స్పష్టం చేసింది. ఆదిత్య థాకరేను ఎలాగైనా సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని భావిస్తున్న శివసేన అధినేత, ఎన్సీపీ కోరికను నెరవేర్చేలా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఉద్ధవ్ థాకరే ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమని ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ ప్రకటించారు. ఇక రాబోయే రెండు మూడు రోజుల్లో రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో!