Pawan Kalyan: పవన్ అంటే అభిమానమే.. కానీ, రాజకీయంగా వ్యతిరేకిస్తా: ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- మొదటి నుంచీ మెగా ఫ్యామిలీకి అభిమానిని
- పవన్‌ది ద్వంద్వ వైఖరి
- ఆయన నిజమైన రాజకీయ నేత కాదు
సమయం దొరికితే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడే ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. చదువుకునే రోజుల నుంచే తాను మెగా ఫ్యామిలీకి పెద్ద అభిమానినని పేర్కొన్నారు. తొలుత చిరంజీవిని, ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ను విపరీతంగా అభిమానించే వాడినని అన్నారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ అంటే అభిమానం ఉన్నా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనను వ్యతిరేకించాల్సి వచ్చిందని అన్నారు. పవన్ చిత్ర పరిశ్రమలో ఉన్నప్పుడు చిరంజీవి మా అన్నయ్య అని చెప్పుకునే వారని, కానీ రాజకీయాల్లోకి వచ్చాక మా నాన్న కానిస్టేబుల్ అని చెప్పుకోవడం ఆయనలోని ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అనిపించిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ను విమర్శించే పవన్.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదని అన్నారు.
పవన్ నిజమైన రాజకీయ నేత కాదని అనిల్ యాదవ్ తేల్చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో సమస్యలు తీరవన్న పవన్ ఇప్పుడు అదే పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌పై తమకు నమ్మకముందని, పవన్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని తెగేసి చెప్పారు.