Telugu: ఉప రాష్ట్రపతి ఆర్టికల్ వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పులాంటిది: పవన్ కల్యాణ్
- పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం
- మాతృభాషను రక్షించుకోవాలన్న వెంకయ్యనాయుడు
- ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన
పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో రానున్న రోజుల్లో తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, మాతృభాష కోసం పరితపించే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాసిన ఆర్టికల్ ఈనాడు పత్రికలో ప్రచురితమైంది. 'అందరి కోసం అమ్మ భాష' పేరుతో రాసిన ఈ ఆర్టికల్ లో మాతృభాషను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు. బోధన మాధ్యమానికి సంబంధించి మరీ ముఖ్యంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యను ఏ భాషలో బోధించాలనే విషయమై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ, వెంకయ్యనాయుడిగారు రాసిన ఆర్టికల్ వైసీపీ ప్రభుత్వానికి ఒక కనువిప్పులాంటిదని ట్వీట్ చేశారు. దీనికి తోడు ఉప రాష్ట్రపతి రాసిన ఆర్టికల్ ను అప్ లోడ్ చేశారు.