NASA: విద్యుత్‌ ఇంధన విమానాలు వచ్చేస్తున్నాయి: ఫలించిన నాసా ప్రయత్నాలు

  • మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న నాసా
  • త్వరలోనే గాల్లోకి ఎగరనున్న మాక్స్‌వెల్‌ ఎక్స్‌-57
  • ఇప్పటికే ఏరోనాటిక్‌ ప్రయోగశాలలో ప్రదర్శన

విమానం పేరు చెబితే ఖర్చు, వేగం గుర్తుకు వస్తాయి. ఎంత దూరాన్నైనా అత్యంత తక్కువ సమయంలో చేరుకునే సాధనం విమానం. అదే సమయంలో ఖర్చు కూడా అందనంత దూరం. దీనికి కారణం విమానాల నిర్వహణ భారం. ముఖ్యంగా విమానాల్లో వాడే ఇంధనం (వైట్‌ పెట్రోల్‌) అత్యంత ఖరీదైనది కావడమే. ఈ ఖర్చును అదుపుచేసి ప్రత్యామ్నాయ ఇంధనంతో విమానాలు నడిపే సాంకేతిక పరిజ్ఞానం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయోగాలు కొలిక్కివచ్చాయి. విద్యుత్‌ ఇంధనంతో నడిచేలా నాసా రూపొందించిన విమానం త్వరలో గాల్లోకి ఎగరనుందని సంస్థ తన ట్విట్టర్‌లో పేర్కొంది.

ఇప్పటికే ఈ విమానాన్ని తమ ఏరోనాటిక్‌ ప్రయోగశాలలో పరీక్షించామని, ఫలితం సంతృప్తిగా ఉందని నాసా పేర్కొంది. ఏడాది కాలంలోపు ఎడ్వర్డ్‌ వైమానిక దళ బేస్‌ నుంచి ఇది గాల్లోకి ఎగురుతుందని పేర్కొంది. 14 మోటార్లతో నడిచే ఈ విమానానికి మాక్స్‌వెల్‌ ‘ఎక్స్‌-57’ అని పేరు పెట్టింది.

2015లో తయారీ ప్రారంభమైన ఈ విమానాన్ని ఇటలీకి చెందిన టెక్నాం - పీ2006టీ విమానం ఆధారంగా తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్‌ బ్రెంట్‌ కోబ్‌లీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇప్పటికే పలు కంపెనీలు విద్యుత్‌ ఇంధన ఆధారిత విమానాల తయారీలో నిమగ్నమై ఉన్నప్పటికీ నాసా రూపొందించిన ఈ విమానం ప్రభుత్వం ధ్రువీకరించిన వాణిజ్య ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోందని చెప్పారు.

నాసా తన ఇరవై ఏళ్ల చరిత్రలో రూపొందించిన విమానాల్లో ఇది మొదటిదని తెలిపారు. కేవలం నాసాకే కాకుండా మొత్తం విమాన పరిశ్రమే ఈ తరహా విమానాలు తయారు చేసేలా సాంకేతిక పరిజ్ఞానం రూపొందుతోందని బ్రెంట్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News