Karnataka: కాంగ్రెస్ నేత డీకే ఇంటికి ఇద్దరు బీజేపీ సీనియర్లు.. పార్టీ మారుతున్నారంటూ ప్రచారం!
- అదేం లేదని కొట్టిపారేసిన కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు
- వ్యక్తిగత కారణాలతో కలిసి ఉంటారని వ్యాఖ్య
- పార్టీ టికెట్ల కోసం ముందస్తు ప్రయత్నం అన్న అనుమానాలు
కర్ణాటకలో ఇద్దరు బీజేపీ సీనియర్ నేతలు రాజు కాగే, అశోక్ పూజారిలు అక్కడి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మనీల్యాండరింగ్ కేసులో ఇటీవలే జైలు నుంచి బెయిలుపై విడుదలై వచ్చిన డి.కె.శివకుమార్‌ను ఈరోజు ఉదయం కలవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన స్థానాలకు త్వరలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాగవాడ నుంచి పోటీ చేసిన రాజు కాగే, గోకాక్ నుంచి పోటీ చేసిన అశోక్ పూజారిలు కాంగ్రెస్ అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. స్పీకర్ అనర్హత వేటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. త్వరలో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్లు ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది.
దీంతో బీజేపీ తరపున మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కదని భావించి, కాంగ్రెస్ టికెట్లు సాధించేందుకు వీరు పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్ దీన్ని కొట్టిపారేశారు. వారు పార్టీ మారే అవకాశాల్లేవని, వ్యక్తిగతమైన కారణాలతో శివకుమార్‌ను కలిసి ఉంటారని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకైతే రాజుకాగే, అశోక్‌పూజారి బీజేపీలోనే ఉన్నారని స్పష్టం చేశారు.